Thursday, January 6, 2011

59 శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్- First Glance

నా బ్లాగులో ప్రస్తావించిన మూడు (అన్ని) ప్రతిపాదనలూ శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదనల్లో పొందుపరచబడ్డాయి. (ప్రాంతీయ మండలి, కేంద్రపాలితప్రాంతం చేసి రెండు వేర్వేరు రాజధానులు, భౌగోళిక సవరణలతో సంయుక్త రాజధాని)


ప్రతిపాదనలు-
• రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి, ప్రత్యేక బోర్డుల ఏర్పాటు
• రాష్టాన్ని రెండుగా విభజించడం, హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతంగా చేసి వేర్వేరు రాజధానులు ఏర్పాటు
• రాష్టాన్ని రాయల తెలంగాణ గా ఆంధ్ర గా విడగొట్టడం
• నల్గొండ, హైదరాబాదు, రంగారెడ్డి లతో కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాతు చేసి ఉమ్మడి రాజధానిగా కొనసాగించడం
•  హైదరాబాదు రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు (సీమాంధ్ర ప్రజల్లో అనుమానాలు నివృత్తిచేసిన పిమ్మట)
• రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం, ప్రాంతాలవారీగా రాజ్యాంగ రక్షణ కల్పించడం

My Analysis-

• 1 మరియు 6 వ సిఫారసులు సమైక్యవాదాన్ని బలపరుస్తాయి
• మిగిలిన అన్ని సిఫారసులు ప్రత్యేకవాదాన్ని బలపరుస్తాయి
• అందరి వాదాలనీ పరిగణన లోకి తీసుకున్నారు
•ఆరుప్రతిపాదనల్లో ఐదుప్రతిపాదనలు హైదరాబాదు ని సీమాంధ్ర తో అనుసంధానిస్తూ హైదరాబాదుని ఎవరికీ పరిమితం చేయలేమని స్పష్టంగా చెప్పారు
• హైదరాబాదుతో సీమాంధ్ర ప్రజలకున్న అనుబంధాన్ని, Dependancy ని స్పష్టంగా గుర్తించారు

ముందుగా ప్రకటించిన విధంగా -- ముందుగా మొదటి సిఫారసు అమలుచేయడానికి ప్రయత్నిస్తారు, సాధ్యంకాకపోతే రెండవది, తర్వాత మూడవది.

కనుక ..

• రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం ఇక సాధ్యం కాదు గనుక మొదటి సిఫారసు ఆచరణీయంకాదు
• హైదరాబాదు పై స్పష్టమైన ప్రకటన్ లేకుండా రాష్ట్రాన్ని విభజించడం సాధ్యంకాదు గనుక రెండవదీ సాధ్యంకాదు
• మూడవ ప్రతిపాదన రాయల్ తెలంగాణ వెనుక రాజకీయ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి కానీ, అది ఏ రకంగానూ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబించడం లేదు
• ఇక ఐదు, ఆరు ప్రతిపాదనలైన సమైక్య రాష్ట్రం, ప్రత్యేకరాష్ట్రం ఏకాభిప్రాయం కుదరదు గనుక ఏ విధంగానూ సాధ్యంకాదు
• సో, నాలుగవ సిఫారసు అయిన , హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ లతో కలిపి కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేయడం అనే సిఫారసు బహుశా ఆచరణ యోగ్యం కావచ్చు, ఈ ప్రతిపాదనకి (రాష్ట్రవిభజనకు మానసికంగా సిద్ధమైన) సీమాంధ్ర నుండీ పెద్ద ప్రతిఘటన ఎదురుకాదు, కానీ ప్రత్యేకవాదులు సంతృప్తి చెందరు.

అందరినీ సంతృప్తి పరచడం సాధ్యంకాదు గనుక, అందరికీ సమానంగా అసంతృప్తి కలిగించే పరిష్కార మార్గం మాత్రమే ముందు కనిపిస్తోంది. ప్రత్యేకరాష్ట్రం కావలంటే ఈ ప్రతిపాదనకి ప్రత్యేకవాదులు దిగిరాక తప్పదు.

కానీ మహబూబ్నగర్, నల్గొండ, హైదరాబాదు, రంగారెడ్డి నాలుగు జిల్లాలు తరలిపోతే తెలంగాణ తీవ్రంగా నష్టపోతుంది, ఆరుజిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అస్థిరత, నాయకత్వ లేమి, వెరసి ఝార్ఖండ్ లాంటి పరిస్థ్జితి పునరావృతమౌతుంది, అసలే వెనుకబడి ఉన్న ఐదు జిల్లాలతో కుడిన తెలంగాణ రాష్ట్రం మావోయిస్టులకి స్వర్గధామం అవుతుంది, దీర్ఘకాలం లో తెలంగాణ నష్టపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరోవైపు, కొత్తగా ఏర్పడబోయే వాణిజ్య, ఉపాధి అవకాశాలు. చిన్న రాష్ట్రాల్లో ఉన్న పరిపాలనా సౌలభ్యాలూ, ప్రతిపాదిత కేంద్రపాలిత ప్రాంతంలో Infrastructure Development, అవకాశాలూ, వాణిజ్య పరమైన అభివృద్ధి, ఈ ప్రతిపాదనలోని అనుకూలాంశాలు.

Wednesday, December 22, 2010

32 నాకేమీ వద్దు, ఈ ప్రపంచం తగలబడిపోవాలి అంతే !

He can’t be bought, bullied or negotiated with… some people just want to see the world burn.”
— Alfred (Michael Caine) speaking of the Joker, in The Dark Knight (2008)

కొంత మందికి ధనం వద్దు, అధికారం వద్దు, గేలి చేసేదానికి లొంగరు, ఏ రకమైన ఒప్పందాలూ, అoగీకరణలూ వారి ముందు పనిచేయవు. కేవలం ప్రపంచం తగలబడిపోవడం కావాలి అంతే, తగలబడిబోతున్న ప్రపంచాన్ని చూడాలి అంతే అదే వారి కోరిక. They just want to see this world burning !!!

నిజంగా నాకు మాటలు రావట్లేదు ఇవాళ, మనుషుల మధ్య విద్వేషాలు రేకెత్తించడం ఎంత సులభం అయిపోయింది. మా సంస్కృతీ మీ సంస్కృతీ ఒకటికాదంటారు. మా పూర్వీకులు వేరు మీ పూర్వీకులు అంటారు, మా దేవుడు వేరు మీదేవుడు వేరు అంటారు. మాది మాతృస్వామ్యం మీది పితృస్వామ్యం అంటారు. బుర్ర లేని జనాలం ఏది చెప్పినా నమ్మేస్తాం.

పోనీ అలాగే! నమ్మేద్దాం, ఎవరేం చెప్పినా నమ్మేద్దాం! రామాయణం అబద్ధం, రావణాసురుడు నిజం. శ్రీకృష్ణుడు అబద్ధం నరకాసురుడు నిజం, దేవీ భాగవతం అబద్ధం మహిషాసురుడు నిజం. అన్నీ నిజాలే! నమ్మేద్దాం!

కనీసం అప్పుడన్నా శాంతిస్తారా? కావల్సిన ప్రయోజనం చేకూరిందని మిన్నకుంటారా?

లేదు- ఇక్కడ ఇంత పెద్ద ఉద్యమం నడుస్తుంటే ఏమీ ఎరగనట్టు నడివీధిలో కనకదుర్గమ్మ విగ్రహం పెట్టిండ్రు, పోలేరమ్మ, నూకాలమ్మ, కనకదుర్గమ్మ వాళ్ళ దేవతలు, గండి మైసమ్మ, కట్టమైసమ్మ, రేణుకా ఎల్లమ్మ, సమ్మక్క సారలమ్మ మన దేవతలు. జాతర్లకి పోయే భక్తులంతా కొంచెం ‘సోయ’ తో మెలగాలని విఙ్ఞప్తి జేస్తున్నం.

అప్పుడే ఏమయింది? రాజకీయాలు అయినయ్, కులాలు అయినయ్, మతాలయినయ్, ప్రాంతాలయినయ్, మనుషుల ఒంటి రంగయింది, మనుషులు మాట్లాడే భాష అయింది, తినే తిండయింది, పూజించే దేవుళ్ళయినారు, కొలిచే దేవతలయినారు. అన్నిట్లోనూ నువ్వు వేరు నేను వేరు అన్న "సోయ" ని చొప్పించాం, మనుషుల్ని ఒప్పించాం, విద్వేషాలు గుప్పించాం, రావణ కాష్టం రగిలించాం!

ఇక చాలు, రగులుతున్న మంటల్లో చలికాచుకుందాం, యుగాలు కష్టపడి నిర్మించిన ప్రతీ వస్తువు కళ్ళ ముందు ఆహుతి అవుతుంటే-

ఇక ఏ మతమైతే నేమి, ఏ ప్రాంతమైతే నేమి, ఏ కులమైతే నేమి, ఏ భాషైతే నేమి, ఎవడెక్కిరిస్తే మనకేమి, ఎవడు ఏడిస్తే మనకేమి, కోట్లుంటే మనకేమి, కోట్ల ఆశలకి తూట్లు పడితే మనకేమి.

ఈ ప్రపంచం ఇలా ఇరుకు గోడలుగా విడిపోయి, ముక్కచెక్కలైపోయి, తగలబడుతుంటే-

ఏ పురస్కారం, ఏ అధికారం, ఏ అంగీకారం ఇవ్వగలుగుతుంది నాకీ "మజా" ని..

నాకేమీ వద్దు, ఈ ప్రపంచం తగలబడిపోవాలి అంతే..  I just want to see this world burning !!

Tuesday, November 2, 2010

49 తెలంగాణా సమస్యకి ఆమోదయోగ్యమైన పరిష్కారాలు 4- భౌగోళిక సవరణలతో సంయుక్త రాజధాని

పరిష్కారం గురించి ఆలోచించే ముందు ముందుగా కొన్నిముఖ్యమైన వార్తాంశాలని గమనించవలసి వుంటుంది.

1) ప్రత్యేక తెలంగాణ ప్రకటన వచ్చిన మర్నాడు అంటే డిసెంబరు 10,2009 తేదీన, ఆంధ్రభూమి దినపత్రిక లోని మొదటిపేజీలో పేరు పెద్దగా వినిపించని ఒక రాజకీయ నాయకుడిచే రాయబడిన బహిరంగలేఖ- ఈ వ్రాతప్రతి నకలు(copy) కోసం బాగా కష్టపడి వెతికాను, దొరకలేదు మీకెవరికైనా దొరికితే దయచేసి జతపరచండి.
నాకు గుర్తున్నంత వరకూ ఆ బహిరంగలేఖలోని సారాంశం ఇది " తర తరాలుగా దక్షిణ తెలంగాణ ప్రజలు, ఉత్తర తెలంగాణ జిల్లాల (ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీం నగర్ వగైరా..) ప్రజలచే తీవ్రంగా మోసగించబడినారు, మా యొక్క వనరులు తరాల తరబడి ఉత్తర తెలంగాణ ప్రజలచే దోపిడీకి గురైనవి", ఈ సామజిక అసమానతలని తగ్గించుటకై "హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం (వరంగల్ వుందో లేదో గుర్తులేదు) జిల్లాలతో దక్షిణ తెలంగాణ రాష్ట్రం ప్రకటించాలి, ఆ పోరాటానికై ప్రజలు సంసిద్ధులు కావాలి" అని.
___________________________

2) సీమాంధ్ర ఎం పీలు శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో కొన్ని అంశాలని ఈ విధంగా ప్రస్తావించడం జరిగింది.(http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=8506&Categoryid=1&subcatid=33)

a) రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే రెండు రాష్ట్రాలతో ఆగదు. గిరిజనులు మన్యసీమను కోరుతున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో కూడా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉంది. కాబట్టి రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే ఐదుగా విభజించాల్సి వస్తుంది. అది అక్కడితో ఆగదు. రానురాను జిల్లానో రాష్ట్రం చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 22 ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఉన్నాయి. కానీ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, నాగాలాండ్, మిజోరాం లాంటి చిన్న రాష్ట్రాల ఏర్పాటు సత్ఫలితాలనివ్వలేదు
b) గత యాభై ఏళ్లలో హైదరాబాద్తో కలుపుకుని తెలంగాణ జనాభా 34 నుంచి 41శాతానికి పెరిగింది. ఒక్క హైదరాబాద్లోనే 1956లో ఏడు లక్షల జనాభా ఉంటే ఇప్పుడు దాదాపు కోటి అయింది. నగరశివార్లలో 3200 శాతం, పాత నగరంలో 70శాతం అభివృద్ధి గత 30 ఏళ్లలోనే జరిగింది. తెలంగాణలో జనాభా పెరుగుదలకు కోస్తాంధ్ర, రాయలసీమల నుంచి వలసలే కారణం. దీని కారణంగానే తెలంగాణ ప్రాంతంలో ఉన్న 13.5 లోక్సభ స్థానాలు 17 అయ్యాయి. ఒక్క విశాఖ స్టీల్ మినహా కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి.
c) రాష్ట్రాన్ని విభజించేందుకు ఆత్మగౌరవం శాస్ర్తీయ ప్రాతిపదిక కాదు. భావోద్వేగాలు ఎక్కువ కాలం నిలవవని చరిత్ర చెపుతోంది-గతంలో బ్రహ్మానందరెడ్డి, పి.వి.నరసింహారావులను ముఖ్యమంత్రులుగా తొలగించినప్పుడు ఎగసిన ప్రత్యేక ఉద్యమాలు గాలిబుడగల్లాగా పేలిపోయాయి
d) ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ కూడా అన్ని ప్రాం తాల్లో ఒకే విధంగా లేదు. జిల్లాల వారీ గా, దక్షిణ, ఉత్తర తెలంగాణ ప్రాంతా ల మధ్య తేడాలున్నాయి. రాష్ట్రాల విభజనపై ఏర్పాటు చేసిన మొదటి ఎస్సార్సీ కూడా సమైక్యరాష్ట్ర స్ఫూర్తిని సమర్థించింది. అప్పటి ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజల ఆమోదంతోనే విలీనం జరిగింది.
e) అన్నిటికన్నా ముఖ్యంగా ఈ క్రింది గణాకాలని పరిశీలించవలసిందిగా మనవి చేస్తున్నాను

___________________________

3) క్రిందటి వారంలో www.thatstelugu.com అనే వెబ్ సైట్ లో చాలా ఉపయోగకరమైన, విలువైన కొన్ని అంశాలు ప్రస్తావించబడ్డాయి. ఒక వెబ్ సైట్ లో ఇంత విలువైన సమాచారం దొరకడం నిజంగా అరుదు, ఇంత మంచి సమాచారమందించిన www.thatstelugu.com నిర్వాహకులకి అభినందనలు తెలియచేస్తూ ఈ క్రింది విషయాలని ప్రస్తావించ దలచాను.(http://thatstelugu.oneindia.in/feature/general/2010/is-there-any-possibility-announce-hyderabad-301010.html)

తెలంగాణవాదులు అంగీకరిస్తారా, లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, నల్లగొండ జిల్లాను కలిపి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడానికి భౌగోళికంగా సాధ్యమయ్యే పనే. అయితే, నల్లగొండ జిల్లా మొత్తం దాంట్లోకి వచ్చే అవకాశం లేదు. హైదరాబాదుకు, కోస్తాంధ్రకు మధ్య తెలంగాణ రాష్ట్రం ఉండకుండా చూడడమే కావాల్సింది. హైదరాబాదు నుంచి రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాలను కలుపుతూ కృష్ణా జిల్లాలోని జగ్గయ్య పేట వరకు, మరో వైపు గుంటూరు జిల్లా సరిహద్దుల వరకు కలిపి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడానికి వీలవుతుంది. భౌగోళికంగానే కాకుండా సామాజిక, సాంస్కృతిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కూడా ఆ వాదనకు బలం చేకూరే అవకాశం ఉంది. నల్లగొండ జిల్లాలోని కోదాడ, మిర్యాలగుడా వంటి ప్రాంతాల్లోకి కోస్తా వలసలు విరివిగా సాగాయి. కోస్తాకు చెందిన పలువురు చాలా కాలం క్రితమే వలస వచ్చి స్థిరపడిపోయారు. సంపన్నులుగా ఎదిగారు. నాగార్జున సాగర్ కాలువ కూడా వస్తుండడంతో మిగతా మెట్టప్రాంతంతో పోలిస్తే ఈ ప్రాంతాలు కాస్తా సస్యశ్యామలంగా ఉంటాయి. హుజూర్ నగర్ ప్రాంతంలో 11 దాకా సిమెంట్ ఫ్యాక్టరీలున్నాయి. చాలా ఫ్యాక్టరీలు కోస్తాంధ్ర పెట్టుబడిదారులకు చెందినవే. ఆ రకంగా ఆ ప్రాంతంలో కోస్తా వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అక్కడి సంస్కృతి కూడా కోస్తా ప్రాంత సంస్కృతికి దగ్గరగా ఉంటుంది. అందువల్ల కూడా తెలంగాణ నుంచి నల్లగొండ జిల్లాలోని తూర్పు ప్రాంతాన్ని విడదీయడానికి అవకాశం ఉందనే వాదనను ముందుకు తేవచ్చు.
___________________________

ఈ అన్నివార్తాంశాలూ మనకి అందిస్తున్న స్పష్టమైన సందేశం ఒకటి వుంది.

"ప్రాంతాల వారీగా భావోగ్వేగాలలోనూ, ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ యొక్క తీవ్రతలోనూ తేడాలున్నాయి. సీమాంధ్ర ప్రాంతానికి ఆనుకుని వున్న దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ప్రత్యేక రాష్ట్రంపై ఎంతో కొంత విముఖత వుంది, పక్కనున్న సీమాంధ్ర జిల్లాలతో భావ సారూప్యతే కాకుండా, సంస్కృతి జీవన విధానం, వారి వారి జీవన స్తితిగతుల్లో రెండో వర్గం వారి ప్రభావం Influence & Dependability ఎక్కువగా వుంది. సీమాంధ్రతో కలిసి వుండడంపై ఎంతో కొంత సానుకూలత వుంది".
___________________________
పరిష్కారం-
 
తెలంగాణ ప్రజానీకం యొక్క మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవిస్తూ "తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం", అదే సమయంలో దక్షిణ తెలంగాణ కోస్తా జిల్లాల మధ్య వున్న భావసారూప్యతని గౌరవిస్తూ- నల్గొండ, ఖమ్మం జిల్లాలని సీమాంధ్రలో కలిపి ఒక ప్రత్యేక రాష్టం గా ఏర్పరచాలి. ఆ విధంగా గ్రేటర్ హైదరాబాదు భౌగోళికంగా రెండు రాష్ట్రాల సరిహద్దులకి తేబడుతుంది. ఈనాటి గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మొత్తం, చండిఘర్ మాదిరిగా కేంద్రపాలిత ప్రాంతం, మరియు రెండు రాష్ట్రాలకూ సంయుక్త రాజధానిగా వ్యవహరించబడుతుంది.
 
అనుకూలాంశాలు-
1) ప్రత్యేక తెలంగాణ, సీమంధ్ర రాష్ట్రాల ఏర్పాటుతో మెజారిటీ ప్రజాభిప్రాయాన్ని గౌరవించినట్లౌతుంది.
2) భవిష్యత్తులో తప్పనిసరిగా రాబోతున్న మరొ (ఉత్తర, దక్షిణ తెలంగాణ) వేర్పాటు ఉద్యమం నివారించబడుతుంది,
3) హైదరాబాదు నగరంపై రెండు రాష్ట్రాలకీ సమానహక్కులు కల్పించబడతాయి, ఈ విధమైన సవరణలతో రాష్ట్రవిభజనకి వున్న భౌగోళిక అడ్డంకులు తొలగిపోతాయి.
4) హైదరాబాదు అభివృద్ధిలో, ఉపాధి అవకాశాల్లో రెండు రాష్ట్రాల ప్రజలకూ సముచితమైన స్థానం కల్పించబడుతుంది తద్వారా పరిపాలనా సౌలభ్యం ఏర్పడుతుంది.
5) సైబరాబాద్ అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో ఏర్పడిన అపోహలు శాశ్వితంగా తొలగిపోయి రాజకీయ, వాణిజ్య సుస్థిరత ఏర్పడుతుంది.
6) ఖమ్మం కంచుకోటగా భావించే వామపక్ష పార్టీ-CPM సమైక్యాంధ్రకి మద్దతిస్తోంది. ప్రత్యేక రాష్ట్ర వాదనని వ్యతిరేకిస్తోంది.
7) స్థానికత అంశంలోనూ, హైదరాబాద్ ఫ్రీ జోన్ విషయంలోనూ మరింత స్పష్టత ఏర్పరచబడి, ఆదాయ మరియు సహజ వనరుల పంపిణీ అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో పారదర్శకంగా జరిగిన పిమ్మట ఈ పరిష్కారం అందరికీ ఆమోదయోగ్యం కాగలదు.

ప్రతికూలాంశాలు-
1) ముఖ్యంగా కొత్తగా ఏర్పడబోయే ఆంధ్ర రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ, సీమాంధ్రల మధ్య మరో వేర్పాటు ఉద్యమం రాదని చెప్పలేం
2) హైదరాబాదుపై సర్వ హక్కులు మావే అంటున్న తెలంగాణ అతివాద ప్రత్యేకవాదులు రాజధానిని పంచుకోవడం అనే విషయం పై ఎంతో కొంత ప్రతిఘటించక మానరు, ఆ ఉద్యమం హింసాత్మకంగా మారే ప్రమాదం ఉంది.
3) ముఖ్యంగా- తెలంగాణ 10 జిల్లాల్లో 2 తగ్గిపోయి, కేవలం 8 జిల్లాలు మిగుల్తాయి. వాటిలో హైదరాబాదు రంగారెడ్డిని మినహాయిస్తే కేవలం 6 జిల్లాలు మిగుల్తాయి. వీటిలో సగం జిల్లాలు అభివృద్ధికి దూరంగావుండగా, హైదరాబాదు వనరులు ఆంధ్ర రాష్ట్రంతో పంచుకోవాల్సిన తరుణంలోఈ జిల్లాలు ఎంత పురోగమిస్తాయో అప్పుడే చెప్పలేం.
4) 6 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రంలో అప్పటికే విస్తరించి వున్న మావోయిస్టు ఉద్యమం మరింత బలపడే అవకాశం వుంది.
5) హైదరాబాదులో సింహభాగం వున్న మైనారిటీ వర్గాల్లో ఈ నిర్ణయం అపోహలు ఏర్పరచడం ఖాయంగా కనిపిస్తుంది, వారి భవిష్యత్ ప్రయోజనాల పరిరక్షణ కై వారికి ఆమోదయోగ్యమైన ఒక స్పష్టమైన ప్రణాళిక ఏర్పరచడం చారిత్రక అవసరం
6) రెండు అసెంబ్లీలు, రెండు హైకోర్ట్ లు, రెండు రాష్టాలకి సంబంధించిన ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ మరియు గవర్నెన్స్, పోలసీ మేకింగ్ మార్పుకి అలవాటుపడని నగరజీవిని కొంతకాలంపాటు అయోమయానికి గురిచేస్తాయి
7) రాష్ట్ర విభజనకి ఒక ముఖ్య కారణంగా చెప్పబడుతున్న నల్గొండ ఫ్లోరోసిస్‌ బాధితుల సమస్యకి ఒక పరిష్కారం వెతకవలసిన అవసరం వుంది.

ముందుగా చెప్పిన విధంగా అందరినీ సంతృప్తి పరచగలిగే పరిష్కారం దొరకనప్పుడు అందరికీ సమానంగా అసంతృప్తి కలగే పరిష్కారాన్ని సూచించడమే మనముందున్న ఏకైక పరిష్కారం.

ఏదైనా ప్రస్తావించ మరచి వుంటే దయచేసి తెలియచేయండి